అమ్మానాన్నా.. మీ దాంపత్యం మాకు ఆదర్శం మీ అనురాగం మాకు సుధాగానం మీ మమకారం మాకు నయగారం మీ ప్రేమ మాకు లాలి మీ ముచ్చట మాకు జోల మీ సహనం మాకు మార్గం మీ శ్రమ మాకు పెట్టుబడి మీ పొదుపు మాకు ఆస్తి మీ త్యాగం మాకు ఫలం
కానీ.. మీ కలహం మాకు దుఃఖం మీ నలత మాకు కలత మీ బాధ మాకు వ్యధ మీ మౌనం మాకు అగమ్యం మీ కోపం మాకు భయం మీ నష్టం మా వెంట మీ కష్టం మాదంట మీ బాష్పం మా కంట
అందుకే.. మీ అన్యోన్యం మా సంకల్పం మీ ఆరోగ్యం మా కర్తవ్యం మీ ఆనందం మా ఆశయం మీ సౌఖ్యం మా లక్ష్యం
ఎన్నేళ్ళైనా తొలినాళ్లలా ఉండాలన్నదే మా ఆకాంక్ష! మీ 48వ పెళ్లిరోజున ఇదే మా అందరి శుభాకాంక్ష!!
If you find reading Telugu difficult, listen to my audio right here.
ఈ దేశంలో అట్టి పార్కు మరోటి లేదని ఎంతోమంది నాకు పట్టి పట్టి చెప్పగా చిన్ననాటి స్నేహితులతో జట్టుకట్టి ఓ మినీవాను బాడుగ కట్టి పట్టుమని మూడు గంటలైనా గడవకముందే చేరుకున్న ఆ చిట్టడవే కట్టి పడేసే అందాల యూసమేట్టి యూసమేట్టి
పార్కునంతా కలియ జుట్టి మిట్టమధ్యాహ్నమైనా సరే పట్టువదలని విక్రమార్కుల్లా దట్టమైన చెట్టు నీడల సాయంతో మెట్టు మెట్టు ఎక్కుతూ ఎట్టకేలకు కొండపైకి చేరుకుంటే కళ్ళకు కట్టిన ఆ ఎత్తైన జలపాతాలతో నిరంతరం ఘోషించే యూసమేట్టి యూసమేట్టి
ఉరుకుల పరుగులతో బిరబిర జారే జలపాతాలను చూసినప్పుడు జాలువారిన ఈ చిరుకవితే:జలపాతాలు
కరిగే మంచు ఉరికే నీరు మానవజాతికి వెలుగును ఇచ్చే శక్తిని దాచుకు పదండి ముందుకు పదండి తోసుకు
మింటిని వదిలి నేలకు ధారగ శిలలను నురగల అభిషేకించగ పదండి ముందుకు పదండి తోసుకు
ఎగసే తెంపరి తుంపర మేఘం తెల్లని మబ్బుకు బాటలు వేయగ పదండి ముందుకు పదండి తోసుకు
నురగల పరుగుల వేగం పెరగగ చెట్టూ పుట్టా రాయీ రప్పా అన్నీ కలుపుకు పదండి ముందుకు పదండి తోసుకు
కొండను చీల్చుకు బండను పెగల్చుకు వచ్చే తొలకరి మొక్కలకాయువు పోస్తూ పదండి ముందుకు పదండి తోసుకు
నిటారు చెట్లే నిలువెత్తు సాక్షిగ దశదశాబ్దాల నిరంతర ప్రవాహమై పదండి ముందుకు పదండి తోసుకు
పల్లెలు వదిలి పట్నాలెళ్తే, అవి ఉద్యోగాలు! పట్నాలు వదిలి పల్లెలకొస్తే, అవి పండుగలు! సాలుకి ఒకసారైనా ఊరంతా కలిస్తే, అదే సంక్రాంతి! పల్లెకు పూర్వ వైభవం తెచ్చే ఆ క్రాంతే, మకర సంక్రాంతి!
మీ ఊళ్ళో ఉన్నా ఏ ఊళ్ళో ఉన్నా, ఈ సంక్రాంతి మీ ఇంట సుఖశాంతుల క్రాంతులు విరజిమ్మాలని ఆశిస్తూ..
సంక్రాంతి శుభాకాంక్షలు!
If you find reading Telugu difficult, listen to my audio right here.
నాలాంటి ఒక సగటు తెలుగు భాషాభిమానికి, ఇలాంటి వేడుక ఒక పండుగతో సమానం!
దీనిని ఇంత అట్టహాసంగా జరిపించటం ఆశ్చర్యకరం!
అలాంటి వేడుకని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం రావటం నా అదృష్టం!
తెలుగు భాష సంరక్షణకి ఎవరు నడుం బిగించినా, అది అభినందనీయం!
ఇంత పెద్ద వేడుకలో చిన్న చిన్న పొరపాట్లు సహజం, క్షమార్హం!
కానీ, భాషకి ప్రాంతీయతని ఆపాదించడం అన్యాయం!
ఎల్లలు లేని భాషకి గిరి గీయాలనుకోవడం మూర్ఖత్వం!
పోతన, సోమన, కాళోజీ, సినారె, దాశరధి, సురవరం..
ఇదివరకూ నాకు తెలుగు కవులుగానే పరిచయం..
కానీ, వారు తెలుగు కాదు.. తెలంగాణా కవులని చెప్పిన సదరు సభా నిర్వాహకుల నిర్వాకం, ఆ మహా కవులని అవమానపరచడం!
మరెందరో తెలుగు సాహితీవేత్తలని ప్రాంతీయవాదంతో ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించడం, తెలుగు సాహిత్యాన్ని అగౌరవపరచడం!
ఆంగ్లగాలికి రెపరెప లాడుతున్న తెలుగుదివ్వెను కొండెక్కకుండా చూసుకోవడం మనందరి కర్తవ్యం!
అందుకు, తెలుగుకు రెండు చేతులైన రెండు రాష్ట్రాల పరస్పర సహకారం ఎంతైనా అవసరం!
ప్రాంతీయతత్వాన్ని పక్కనపెడదాం, అధికారమదాంధులకి సరైన దారి చూపుదాం!
కమ్మనైన అమ్మ భాషని కాపాడుకోవటానికి చేయి చేయి కలుపుదాం.. సభలను మరచి, ప్రాంతాలకతీతంగా!
If you find reading Telugu difficult, listen to my audio right here.