రోజూ తగవుపడే తల్లిదండ్రులని చూశా
ఆ తగవుల్లో అల్లాడే పిల్లాడిని చూశా!
ఇక కలిసి మెలగలేక విడిపోయిన భార్యాభర్తలని చూశా
మరి తానెటో తెలియని చంటిపిల్ల అయోమయం చూశా!
తోడు లేని జీవితం గోడుని చూశా
తాడు లేని బొంగరం జాడని చూశా!
గుక్క నీటికోసం పక్కూరెళ్ళే అక్కని చూశా
ముద్ద కూటికోసం రెక్కచాచే డొక్కని చూశా!
బీటలువారి ఎండిన పొలంలో కన్నీరెండిన కళ్లని చూశా
ఏడాది కష్టం అప్పులపాలై చూరుకు ఊగిన తాళ్ళని చూశా!
నియంత నిరంకుశత్వంతో కాలరాసిన హక్కులు చూశా
అంతర్గత కుమ్ములాటతో అంతరించిన శాంతిని చూశా!
లేని ఉద్యోగం కోసం ఊరూరూ తిరిగే నిరుద్యోగిని చూశా
చాలీచాలని జీతంతో సతమతమయ్యే చిరుద్యోగిని చూశా!
అంతులేని సంపద ఉన్నా తినలేని అభాగ్యం చూశా
అందలేని అందలమెక్కినా దూరమైన ఆనందం చూశా!
పలకలేని నోటిని చూశా
వినలేని చెవులని చూశా
నడవలేని కాళ్ళని చూశా
చూడలేని కళ్ళని చూశా!
తరచి చూస్తే..
లోకంలో లెక్కలేని ఈతిబాధలు ఎన్నెన్నో!
ఈదలేని భవసాగరాలు ఇంకెన్నో!
అంత బాధతో పోలిస్తే మనకున్నదెంత?
గుమ్మడికాయ ముందు ఆవగింజంత!
ఆ కొంత మరిస్తే, మనకింకెంతో ఇచ్చిన ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా.. Thanks!
Happy Thanksgiving!