2020 సంవత్సరంలో కరోనా మానవాళి మీద మొదటిసారి దండెత్తినప్పుడు, ఒక ప్రముఖ దినపత్రిక నిర్వహించిన కవితా పోటీ సందర్భంగా, నేను రాసి పంపిన ఈ కవిత ( ఎంపిక కాలేదు)
సర్వ జీవులూ నా వశమన్నా
ఏ జంతువునీ వదలక తిన్నా
అంతు చిక్కని సూక్ష్మ జీవి నను
గజగజ నిలువున వణికిస్తుంటే
విడివడుతున్నాయ్.. నేనే గొప్పని నిన్నటిదాకా వీగిన నీలుగులు
వడివడిగా విడివడుతున్నాయ్!
పెరిగే జీతం పరపతి అన్నా
పదోన్నతే పరమావధి అన్నా
ఇల్లూ పెళ్ళాం న్యుసెన్సన్నా
ఇంట్లో ఉంటూ పనిచేస్తుంటే
ఇంటి పనుల్లో సాయం చేస్తూ
భార్య కళ్ళలో వెలుగును చూస్తే
విడివడుతున్నాయ్.. నా కళ్ళను కమ్మిన చెమ్మ తెరలు
వడివడిగా విడివడుతున్నాయ్!
గడప దాటితే వాహనమన్నా
కాలుష్యం భూమిని కప్పేస్తున్నా
ఐతే నాకేంటని మిన్నకున్నా
గూట్లో వాలిన గువ్వ స్వనం
కిటికీలో చేరిన కోకిల గానం
‘మాకెందుకీ శాపం’ అని ప్రశ్నిస్తుంటే
విడివడుతున్నాయ్.. నా ప్రగతి చిమ్మిన కారు మబ్బులు
వడివడిగా విడివడుతున్నాయ్!
ఊడ్చే వాళ్ళని విసుక్కున్నా
కడిగే వాళ్ళని కసురుకున్నా
చెమటోడితే చీదరించుకున్నా
శుద్ధమైన నా మరో ప్రొద్దు కోసం
తమ జీవితం తెల్లారినా పర్లేదని
అలుపెరగక రాత్రీపగలూ శ్రమిస్తుంటే
విడివడుతున్నాయ్.. నా బుర్రకు పట్టిన అహంకారపు బూజులు
వడివడిగా విడివడుతున్నాయ్!
రక్షకభటులే భక్షకులన్నా
సైన్యం గుప్పిట ఇక్కట్లన్నా
తప్పించుకు నే తిరుగుతున్నా
మండుటెండలో మాడిపోతూ
దిగ్బంధాన్ని అమలు చేస్తూ
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంటే
విడివడుతున్నాయ్.. ఆపద్బాంధవులపై అల్లిన ఆరోపణలు
వడివడిగా విడివడుతున్నాయ్!
మానవుడే మహనీయుడన్నా
జగత్తు మొత్తం నా జాగీరన్నా
నా నడతే నాగరికతన్నా
నా ప్రగతే ధ్యేయమన్నా
కానీ ఇప్పుడు..
అనుబంధాల మధురిమలతో
ఇదివరకెరుగని అనుభూతులతో
మానవత్వం కొత్త మొగ్గలేస్తుంటే
నన్ను నాకే కొత్తగా పరిచయం చేస్తూ
కనిపించని కరోనా నాకు కనువిప్పు కలిగిస్తుంటే
విడివడుతున్నాయ్.. తరాలుగా పేరుకున్న అపోహల దొంతరలు
ఒక్కొక్కటిగా విడివడుతున్నాయ్!
నాలో ఊపిరులూదటానికి
తన ఆయువునే పణంగా పెట్టిన
వైద్యుడే నారాయణుడంటున్నా
ముక్కోటి నారాయణుల పుణ్యఫలమో
అహర్నిశల పరిశోధనల ఫలితమో
ప్లాస్మా తో ప్రయోగాలూ
క్లోరోక్విన్ తో కసరత్తులూ
మహమ్మారిని మెల్లమెల్లగా తరుముతుంటే
చిగురాశలు నిండిన నా కళ్ళకు
అగుపడుతున్నాయ్.. మన మనుగడపై ముసిరిన చీకటి మేఘాలు
వడివడిగా విడివడుతున్నాయ్!
“శుద్ధమైన నా మరో ప్రొద్దు కోసం
తమ జీవితం తెల్లారినా పర్లేదని” Nice lines
LikeLike