ప్రపంచ వింతల్లో ఓ వింత ఐన “Grand Canyon”లో, అద్భుతమైన సూర్యాస్తమయాన్నీ, సూర్యోదయాన్నీ చూస్తున్నప్పుడు నేను పొందిన అనుభూతికి అక్షర రూపమే.. ఓ భానుడా!
నిత్యం మండే జ్యోతివి నువ్వు
భూమి అంచున దివ్వెవి నువ్వు!
జీవకోటికి ప్రాణము నువ్వు
ప్రాణం కలిసే పరమాత్మవి నువ్వు!!
రోజూ వచ్చే వేళ, వెళ్ళే వేళ
తొంగిచూసే మబ్బుల కెంపు నువ్వు!
ప్రతి రోజూ జరిగే తంతే, కానీ
చూస్తూ వుంటే ఎంత వింతో.. నువ్వు!!
కొన్ని కోట్ల ఏళ్ళు గడుస్తున్నా
రోజూ వస్తావ్ రోజూ వెళ్తావ్!
అక్కడే వెలుస్తావ్ ఇక్కడే దాక్కుంటావ్
గతినే తప్పని శరణాగతి నువ్వు!!
అస్తమిస్తూ నిద్ర పొమ్మనేది నువ్వు
ఉదయిస్తూ మళ్లీ లెమ్మనేది నువ్వు!
జీవకోటి ఎప్పుడు ఏం చెయ్యాలో
చెప్పకనే చెప్పేది నువ్వు!!
గ్రహగతులను నిర్దేశించేది నువ్వు
ఆరు ఋతువులను శాసించేది నువ్వు!
ప్రాణికోటికి ఎప్పుడు ఏం కావాలో
దూరానున్నా దగ్గరుండి చూసేది నువ్వు!!
ఉషా కిరణాల తుషారం నువ్వు
చంద్రుడు రువ్వే క్రాంతివి నువ్వు!
మరో రేపటి కోసం
మళ్లీ ప్రజ్వలిల్లే అఖండజ్యోతివి నువ్వు!!
కనపడని దేవుళ్ళు ముక్కోటి ఉన్నా
రోజూ కనపడే ఒకేఒక్క దైవం నువ్వు!
భానుడివి నువ్వు!!
సూర్యభగవానుడివి నువ్వు!!!
If you find reading Telugu difficult, listen to my audio right here.