Featured

Be Thankful!

రోజూ తగవుపడే తల్లిదండ్రులని చూశా
ఆ తగవుల్లో అల్లాడే పిల్లాడిని చూశా!

ఇక కలిసి మెలగలేక విడిపోయిన భార్యాభర్తలని చూశా
మరి తానెటో తెలియని చంటిపిల్ల అయోమయం చూశా!

తోడు లేని జీవితం గోడుని చూశా
తాడు లేని బొంగరం జాడని చూశా!

గుక్క నీటికోసం పక్కూరెళ్ళే అక్కని చూశా
ముద్ద కూటికోసం రెక్కచాచే డొక్కని చూశా!

బీటలువారి ఎండిన పొలంలో కన్నీరెండిన కళ్లని చూశా
ఏడాది కష్టం అప్పులపాలై చూరుకు ఊగిన తాళ్ళని చూశా!

నియంత నిరంకుశత్వంతో కాలరాసిన హక్కులు చూశా
అంతర్గత కుమ్ములాటతో అంతరించిన శాంతిని చూశా!

లేని ఉద్యోగం కోసం ఊరూరూ తిరిగే నిరుద్యోగిని చూశా
చాలీచాలని జీతంతో సతమతమయ్యే చిరుద్యోగిని చూశా!

అంతులేని సంపద ఉన్నా తినలేని అభాగ్యం చూశా
అందలేని అందలమెక్కినా దూరమైన ఆనందం చూశా!

పలకలేని నోటిని చూశా
వినలేని చెవులని చూశా
నడవలేని కాళ్ళని చూశా
చూడలేని కళ్ళని చూశా!

తరచి చూస్తే..

లోకంలో లెక్కలేని ఈతిబాధలు ఎన్నెన్నో!
ఈదలేని భవసాగరాలు ఇంకెన్నో!

అంత బాధతో పోలిస్తే మనకున్నదెంత?
గుమ్మడికాయ ముందు ఆవగింజంత!

ఆ కొంత మరిస్తే, మనకింకెంతో ఇచ్చిన ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా.. Thanks!

Happy Thanksgiving!

Happy Father’s Day!

Happy New Year 2024!

తెలుగు భాషా దినోత్సవం!

తెలుగుభాష అంతరించిపోతోందని వేదన చెందేవాళ్ళకీ
‘తెలుగువాడకం ఎలా పెంచాలా’ అని లోచించేవాళ్ళకీ
కమ్మని పాట, తియ్యని పద్యం విని నందించేవాళ్ళకీ
అచ్చతెలుగులో మాట్లాడేవాళ్ళని చూసి రాధించేవాళ్లకీ
మనమూ తెలుగులోనే మాట్లాడాలని రాటపడేవాళ్ళకీ
పిల్లలకి కూడా తెలుగు నేర్పాలని వేశపడేవాళ్ళకీ
అది చేతకాక, సాధ్యంకాక లోలోనే క్రందించేవాళ్ళకీ

‘అసలెందుకీ తెలుగు’ అనే ప్రశ్నకి సమాధానం చెప్పలేక అవస్థపడేవాళ్ళకీ

అంటే.. క్లుప్తంగా.. నాలాంటి తోటి భాషాభిమానులందరికీ..

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు!
తెలుగు మాట్లాడేవాళ్ళందరికీ అభివందనాలు!!

ఆది శంకరాచార్య జయంతి!


నాకు ఈ వయసులో కూడా అర్ధం ఐనట్టే వుండి ఏ మాత్రం అర్ధం కాని వేదాంతాన్ని,
శంకరాచార్యుల వారు తన పన్నెండవ ఏటనే ఔపోసన పట్టి,
ముప్పైరెండేళ్లకే దేశపు నలుమూలలనీ కలియ చుట్టి,
ప్రస్థాన త్రయాలైనట్టి ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీతలకు భాష్యాలు చెప్పి,
మూఢవిశ్వాసాలలో మునిగిపోతూ దారితప్పిన సమాజానికి సన్మార్గాన్ని చూపి,
ఆనాటికే మరుగున పడుతున్న సనాతన ధర్మానికి సరికొత్త ఊపిరులూది,
“అంతా ఒక్కటే” అంటూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించిన..

తత్వవేత్తలకే మార్గదర్శి..
గురువులకే గురువు..
జగద్గురు ఆది శంకరాచార్యుల వారి జయంతి సందర్బంగా..
అందరికీ ఆత్మజ్ఞాన సిద్ధిరస్తు!



వసంతం!


నాకే కాదు.. ఈ భూమికి, భూమ్మీది జీవరాశులన్నిటికీ వసంత ఋతువు అంటే చాలా ఇష్టం!
ఇలాంటి వసంతాన్ని నాకు కనిపించే ప్రకృతి అందాలతో పోల్చి వర్ణించే ఓ చిన్న ప్రయత్నమే.. వసంతం!


వికసించే వన్నెల పువ్వై
చిగురించే పచ్చని చెట్టై

లేలేత ఆకులే కోకలై
తుళ్ళే కొమ్మకు సోకులై

కుహూకుహూమనే కోకిలై
ఝూ ఝుమ్మనే తుమ్మెదై

తారాడే పిల్ల తెమ్మెరై
వేకువే వెచ్చని భానువై

పలకరించే పచ్చికై
పులకరించే పుడమై
పరవశించే మనసై
మైమరపించే సొగసై

పుడుతుంది మళ్ళీ జీవమై!
నా మదిలో మధుర భావమై!!



మహిళా దినోత్సవం!


సృష్టికి మూలం వెతుక్కుంటూ వెళ్తే..
అది ఓ స్త్రీ దగ్గరే ఆగుతుంది!

మనిషిని పుట్టించే బ్రహ్మ కోసం తపస్సు చేస్తే..
తల్లి గర్భమే ప్రత్యక్షమౌతుంది!

స్వార్ధం లేని ప్రేమ కోసం ఆరా తీస్తే..
అమ్మ చేసే త్యాగమే గుర్తుకొస్తుంది!

అంతులేని ఓర్పు సాధ్యమా అని ప్రశ్నిస్తే..
భర్తను భరించే భార్యే బదులౌతుంది!

ఒకేసారి పది పనులు కుదరవని శంకిస్తే..
ఇంట్లో ఇల్లాలే కళ్ళలో మెదులుతుంది!

ప్రకృతికి సమతూగే సౌందర్యం లేదని ఖండిస్తే..
అతివ అందం ప్రకృతికే అలంకారమంటుంది!

జనాభాలో మీరు సగభాగమే ఐనా.. మా జీవితంలో మీది సింహభాగమే!


హృదయం నింపటానికి ప్రేయసి,
మనసు విప్పటానికి సోదరి,
ప్రేమ పంచటానికి కూతురు..
వెరసి.. మీరు లేనిదే మేము లేము.

మహిళా దినోత్సవ సందర్బంగా, మీకివే మా శుభాకాంక్షలు!


అల

నా మాట

ఈ మధ్యనే, ఒక అందమైన సముద్రపు ఒడ్డున విహారానికి వెళ్ళినప్పుడు, సముద్రపు అలలు చేసే విన్యాసాలనూ, ఆ అలలతో చిన్నాపెద్దా ఆడే ఆటలనూ, నేను ఉల్లాసంగా గమనిస్తున్నప్పుడు, నాలో దొరలిన చిరు అనుభూతుల మాల.. ఈ “అల”!


‘అల’ను మించిన చెలిమి లేదు
రోజంతా  ఆడినా అలుపు రాదు

అల్లంత దూరం నుంచీ తీరందాకా వస్తుంది
పాలపొంగు నురగతో చిలిపి అల్లరి చేస్తుంది

పున్నమి వెన్నెల కాంతిని పరుచుకుని వస్తుంది
రంగుల వన్నెల గవ్వలను మోసుకుని తెస్తుంది

పడినా మళ్ళీ లేవాలని పదే పదే చెబుతుంది
దూరం ఎంతైనా తీరం చేరాలనే చెబుతుంది

అలసి సొలసిన మనసులకు విశ్రాంతినిస్తుంది
భావ కవితల భావుకులకు ప్రేరణనిస్తుంది

జంట ప్రేమికుల పాదాలను ప్రేమతో పలకరిస్తుంది
చిన్నారుల ఇసుక గూళ్ళను లాలితో ముద్దాడుతుంది

రేతిరంతా తోడులేరని హోరున ఘోషిస్తుంది
తెల్లవారి వేకువకోసం ఆతృతగా వేచిచూస్తుంది

మరోరోజు మరెందరినో మైమరపించడానికి
తెరలు తెరలుగా తీరానికి తరలి వస్తూనే ఉంటుంది!

మిత్రమా..
అలాంటి అలను, అలాంటి చెలిమిని మలినం చెయ్యటం తగునా?

సముద్రతీరానికి అర్ధంలేని పాస్టిక్ వ్యర్ధంతో తీరని అనర్ధం.. భావ్యమా?

అసలు.. అల తలచుకుంటే ప్రళయం కష్టమా?
స్నేహం సునామీగా మారితే మనకే నష్టం సుమా!


శుభకృత్

ప్రపంచం ఎదుర్కుంటున్న ప్రస్తుత సమస్యలు సమసిపోవాలని కోరుకుంటూ..

దేశాల మధ్య యుద్ధాలు ఆగిపోవాలని
జాతుల మధ్య దూరాలు తగ్గిపోవాలని

ప్రక్కనున్న పొరుగుదేశం మెరుగుపడాలని
భ్రష్టుపట్టిన సొంతరాష్ట్రం బాగుపడాలని

అంతుచిక్కని మాయరోగం మాయమవ్వాలని
మరింకేదేదో కొత్తరోగం పుట్టకుండాలని

మింటిని అంటిన ధరలు దిగిరావాలని
ఇంటింటా సుఖశాంతుల సిరులు పెరగాలని

శుభకృతు సంవత్సరాన అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ.. ఉగాది శుభాకాంక్షలు!


ఇంకేం చేయగలం

‘రిపబ్లిక్’ అనే సినిమా చూసి ముగింపుకి చలించినా, సదరు వ్యవస్థ మార్పుకి ఏమీ చెయ్యలేక సిగ్గుపడినా,నేలకొరిగిన ఎందరో అనామక వీరులని క్షమాపణలు కోరడం తప్ప.. ‘ఇంకేం చేయగలం’


కులానికి ఓటేసే మనం ఇంకేం చేయగలం..
ప్రజాస్వామ్యాన్ని కాటేయడం తప్ప.

మతానికి పూతవేసే మనం ఇంకేం చేయగలం..
దేశాన్ని పాతరేయడం తప్ప.

స్వార్ధంతో కుళ్లిపోయిన మనం ఇంకేం చేయగలం..
సమాజాన్ని కుళ్లబొడవడం తప్ప.

స్కీములకి అలవాటుపడ్డ మనం ఇంకేం చేయగలం..
స్కాములకి సర్దుకుపోవడం తప్ప.

అసలైన నాయకుడి కోసం ఎటెటో చూసే మనం,
ఆ నాయకుడు మనలోంచే వస్తే ఎలా సహించగలం..
పడదోసే అదును కోసం కాచుక్కూర్చోడం తప్ప.

దేశాన్ని ఎప్పుడూ నిందించే మనం ఇంకేం చేయగలం..
పరదేశానికి పరుగులు పెట్టడం తప్ప.

తెల్లారేసరికల్లా చల్లారిపోయే మనం ఇంకేం చేయగలం..
ఓ పూట సినిమా చూసి తొంగోడం తప్ప..
ఓటిటి లో మరోటి చూసి నిన్నటిది మర్చిపోవడం తప్ప.


శ్రీ ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు!

Listen to my audio of this blog on Spotify or Google Podcasts.

అప్పుడే సంవత్సరం గడిచిందా! ‘శార్వరి’ వొచ్చింది మొన్నేగా..  అన్నట్టుంది!
ఇంట్లోంచి గట్టిగా కనీసం కాలైనా బయట పెట్టింది లేదు.. భూమి మాత్రం సూర్యుడి చుట్టూ ఒక చుట్టు చుట్టేసింది!

వసంత కోకిలలు తమ కుహూ రాగాలు మళ్ళీ కూస్తూ ఉన్నాయ్!
రంగు రంగుల పూలు మళ్ళీ పూస్తూ ఉన్నాయ్!
కొన్ని చోట్ల మండే ఎండలు మళ్ళీ కాస్తూ ఉన్నాయ్!
మరి కొన్ని చోట్ల కరిగే మంచుల సెలయేళ్ళు పరవళ్ళు తీస్తూ ఉన్నాయ్!
బడి పిల్లలకి సెలవులు మళ్ళీ వస్తూ ఉన్నాయ్!

వీటితో పాటు, అదేమిటో గానీ, కరోనా కూడా తన కోరలు మళ్ళీ చాస్తూ ఉంది!
గత కొంత కాలంగా అశ్రద్ధగా ఉన్న మనల్ని హెచ్చరిస్తూ ఉంది!
మనమంతా తీసుకోవలసిన జాగ్రత్తల్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఉంది!

ప్లవము’ అంటే ‘పడవ’ అని అర్ధం.
ఈ ఉగాది, మనల్ని ‘కరోనా’ అనే విషసాగరం దాటించి, గట్టున పడేసే ఆశల ప్లవము కావాలని ఆశిస్తూ..

మళ్లీ కోయిల రాగాల్ని వింటూ, పూవుల అందాల్ని చూస్తూ, పరవళ్ళు తొక్కే సెలయేళ్లతో ఆడుతూ, సెలవులని ఆనందంగా గడిపే మునుపటి రోజులు తొందర్లోనే రావాలని కోరుకుంటూ..

అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు!