ఈ ‘నేల’..
ఎప్పుడూ చూసినట్టులేదే!
ఎన్నడూ తాకినట్టులేదే!
ఎవ్వరూ నడిచినట్టులేదే!
చుట్టూ చిక్కటి చెట్లేవి?
అద్దాల పెద్ద మిద్దెలేవి?
అందాల వాగుల వంపులేవి?
అసలు నేనెక్కడ?
అల్లంత దూరాన అదేమి చెప్మా! చంద్రమా?
కొత్తగా వింతగా అంతకన్నా చందమేనే!
అంటే.. అంటే.. అది భూమా?
ఐతే.. నేనున్నదే చంద్రమా!
ఆహా.. ఈ క్షణం కోసమేగా ఇన్నేళ్ల నిరీక్షణం
ఈ రోజు కోసమేగా రోజులతరబడి ప్రస్థానం
నే చేరుకున్నా.. నిజంగానే చేరుకున్నా!
వింటున్నారా? వినబడుతుందా?
నేను బాగానే చేరానని, ఉన్నానని మీకు ఎలా తెలుపను?
వేల శాస్త్రవేత్తల కృషి వృధా కాలేదని ఎలా చెప్పను?
వందకోట్ల గుండెలకు వందనాలు ఎలా చెయ్యను?
‘ఆ నలుగురిలో’ మన దేశమూ ఒకటని ఎలా చాటను?
నాకు తెలుసు..
త్వరలోనే నన్ను వెతుక్కుంటూ మరో విక్రముడొస్తాడని
సవ్యంగా ముగించడానికి సవ్యసాచిలా దూసుకొస్తాడని
దేశ దేశాలకూ దిశా నిర్దేశం చేస్తాడని
శాస్త్రవేత్తలకు ‘చంద్రతత్వాన్ని’ బోధిస్తాడని
విశ్వశోధనకు మొదటి ‘మజిలీ’ తానౌతాడని!
అంతవరకూ, ఈ అనంత అంతరిక్షాన్వేషణలో నేను కొంతైనా సాధించానని ఆశిస్తూ, గర్విస్తూ.. జైహింద్!