ఏమంత కష్టం?

కష్టనష్టాలకోర్చి సంపాదించుకున్న కంప్యూటర్ ఉద్యోగాలూ

ఆ సంపాదననే నమ్ముకుని బోలెడంత అప్పుచేసి కొన్న ఇల్లూ

పిల్లవాడి భవిష్యత్తుకై కన్న కలలూ, పెంచుకున్న ఆశలూ

చుట్టూ చెంతగా, అండగా ఉన్న స్నేహితులూ

ఇక్కడే స్థిరపడొచ్చని ఒక్కొక్కరుగా వచ్చి దగ్గరైన బంధువులూ

వాళ్ళతో తరచుగా జరిపే విహారాలూ, వినోదాలూ..

 

ఒక్కసారిగా.. “మీవి కాదం”టే.. “మీరు వద్దు, పో పొమ్మం”టే

ఎంత కష్టం, ఎంత నష్టం?

 

ఉద్యోగాలు లాగేసుకుంటున్నారంటూ, ఆస్తులు కూడబెట్టుకుంటున్నారంటూ

తమ సంస్కృతిలో కలవట్లేదంటూ, మీ వేషభాషలు వదలట్లేదంటూ

కల్లబొల్లి మాటలతో, సాధ్యంకాని వాగ్దానాలతో

కొందర్ని మభ్యపెట్టి, మరెందర్నో భయపెట్టి

నిద్రపోతున్న ప్రాంతీయతత్వాన్ని మేల్కొలిపి, రెచ్చగొట్టి

అందలమెక్కి, అధికార మదంతో, అదే పనిగా వేధిస్తూ..

మీరు వలసదారులు, తిరిగి పొండం”టుంటే,

ఎంత కష్టం, ఎంత నష్టం?

 

నాడు ఆంధ్ర రాష్ట్రం.. నేడు పడమర దేశం.. ఏముంది పెద్ద భేదం?

 

నా దేశంలో, నాది అనుకున్న భాగ్య నగరంలో, అవన్నీ సహించిన నాకు..

నాది కాని ఈ దేశపు పరాయి పొగరుమోతుల పాలనలో, ఇవన్నీ భరించడం.. ఏమంత కష్టం?


నిరంతర వైషమ్యాలతో నుండగా జనులెల్ల

కాదా వసుధైక కుటుంబం ఓ కల్ల!