నవ కరోనా..
ఇదివరకెరగని
కంటికి దొరకని
అంతే చిక్కని
సూక్ష్మ రక్కసి!
ఎల్లలు దాటి
కోరలు చాచి
కాటును వేసే
పెను సునామీ!
ఇది బహుశా..
లెక్కకు మించి భూమికి బరువై
జిహ్వమునెంచి తిండికి కరువై
హద్దులు మరచి
జీవుల మింగే మానవ జాతిని
హెచ్చరించిన
అన్య జీవుల యుద్ధ నగారా!
జనులారా..
ఈ ‘యుద్ధానికి’ సన్నద్ధం కాకున్నా
రాబోయే ఆ ‘యుద్ధాలు’ ఆపకున్నా
గుండ్రటి భూమి.. తిరుగక మానదు!
సూర్య చంద్రులు.. వెలుగక మానరు!
కానీ, మనకి మాత్రం.. ఉనికి ఉండదు!!
జీవ వైవిధ్యం.. ప్రకృతికి మూలం!
సమతుల్య లోపం.. వైపరీత్యానికి మూలం!
జీవావరణ సంరక్షణం.. మన మనుగడకే మూలం!
ఈ యథార్థం ఇప్పటికైనా గ్రహిస్తే
ఈ సంతులనం ఇకనుంచైనా పాటిస్తే
మన ముందుండేది..
కరోనాల ఊసే లేని భావి జగమే!
ఆంక్షల గోసే లేని నవ యుగమే!
ఆ నవయుగానికి ఆది కావాలి.. ఈ యుగాది!
శార్వరినామ ఉగాది శుభాకాంక్షలు!