సంక్రాంతి

పల్లెలు వదిలి పట్నాలెళ్తే, అవి ఉద్యోగాలు!
పట్నాలు వదిలి పల్లెలకొస్తే, అవి పండుగలు!
సాలుకి ఒకసారైనా ఊరంతా కలిస్తే, అదే సంక్రాంతి!
పల్లెకు పూర్వ వైభవం తెచ్చే ఆ క్రాంతే, మకర సంక్రాంతి!

మీ ఊళ్ళో ఉన్నా ఏ ఊళ్ళో ఉన్నా, ఈ సంక్రాంతి మీ ఇంట సుఖశాంతుల క్రాంతులు విరజిమ్మాలని ఆశిస్తూ..

సంక్రాంతి శుభాకాంక్షలు!

Advertisements

ప్రపంచ తెలుగు మహాసభలు – 2017

నాలాంటి ఒక సగటు తెలుగు భాషాభిమానికి, ఇలాంటి వేడుక ఒక పండుగతో సమానం!
దీనిని ఇంత అట్టహాసంగా జరిపించటం ఆశ్చర్యకరం!
అలాంటి వేడుకని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం రావటం నా అదృష్టం!
తెలుగు భాష సంరక్షణకి ఎవరు నడుం బిగించినా, అది అభినందనీయం!

ఇంత పెద్ద వేడుకలో చిన్న చిన్న పొరపాట్లు సహజం, క్షమార్హం!
కానీ, భాషకి ప్రాంతీయతని ఆపాదించడం అన్యాయం!
ఎల్లలు లేని భాషకి గిరి గీయాలనుకోవడం మూర్ఖత్వం!
పోతన, సోమన, కాళోజీ, సినారె, దాశరధి, సురవరం..
ఇదివరకూ నాకు తెలుగు కవులుగానే పరిచయం..
కానీ, వారు తెలుగు కాదు.. తెలంగాణా కవులని చెప్పిన సదరు సభా నిర్వాహకుల నిర్వాకం, ఆ మహా కవులని అవమానపరచడం!
మరెందరో తెలుగు సాహితీవేత్తలని ప్రాంతీయవాదంతో ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించడం, తెలుగు సాహిత్యాన్ని అగౌరవపరచడం!

ఆంగ్లగాలికి రెపరెప లాడుతున్న తెలుగుదివ్వెను కొండెక్కకుండా చూసుకోవడం మనందరి కర్తవ్యం!
అందుకు, తెలుగుకు రెండు చేతులైన రెండు రాష్ట్రాల పరస్పర సహకారం ఎంతైనా అవసరం!
ప్రాంతీయతత్వాన్ని పక్కనపెడదాం, అధికారమదాంధులకి సరైన దారి చూపుదాం!
కమ్మనైన అమ్మ భాషని కాపాడుకోవటానికి చేయి చేయి కలుపుదాం.. సభలను మరచి, ప్రాంతాలకతీతంగా!

ఎవరు మృగం?

పులంటే భయం
తొండంటే జుగుప్స
పామంటే వణుకు
తోడేలంటే బెదురు
ముంగీసంటే కంగారు
ఒంటెఅంటే వాసన
గాడిదంటే చులకన

కానీ..

వాటిని కలిశాక
ఒళ్లో ఆడించాక
తలపై తడిమాక
మెడపై నిమిరాక
ఆపై ముద్దాడాక
ఇంకేముంది..
జంతుప్రేమంటే ఇదికాక!COLLAGEఅలా సరదాగా గడిపాక
అటుపై ఇంటికి వచ్చాక
ఆ రాత్రి..

ఎందుకో నా కళ్ళల్లో పదేపదే మెదలు
పులిపిల్ల మొఖంలో ఏదో దిగులు
మనసులో మొదలైన చిన్న గుబులు
అనుమానంతో ఓసారి చేశాను గూగులు
జంతుశాలలన్నీ మహా పెద్ద స్కాములు!

పరిరక్షణ పేరుతో
క్రమశిక్షణ సాకుతో
స్వేచ్ఛను హరించే
నిర్దయతో బంధించే
మనుషులంటే.. మహా కోపం
మనమే వాటిపాలిట శాపం!

ఇంత చిన్న బోనులో అంత పెద్ద పులా?
అదీ జీవితాంతం! ఎలా?
మనిషా.. పులా? ఎవరు మృగం?

 

ఏమంత కష్టం?

కష్టనష్టాలకోర్చి సంపాదించుకున్న కంప్యూటర్ ఉద్యోగాలూ

ఆ సంపాదననే నమ్ముకుని బోలెడంత అప్పుచేసి కొన్న ఇల్లూ

పిల్లవాడి భవిష్యత్తుకై కన్న కలలూ, పెంచుకున్న ఆశలూ

చుట్టూ చెంతగా, అండగా ఉన్న స్నేహితులూ

ఇక్కడే స్థిరపడొచ్చని ఒక్కొక్కరుగా వచ్చి దగ్గరైన బంధువులూ

వాళ్ళతో తరచుగా జరిపే విహారాలూ, వినోదాలూ..

 

ఒక్కసారిగా.. “మీవి కాదం”టే.. “మీరు వద్దు, పో పొమ్మం”టే

ఎంత కష్టం, ఎంత నష్టం?

 

ఉద్యోగాలు లాగేసుకుంటున్నారంటూ, ఆస్తులు కూడబెట్టుకుంటున్నారంటూ

తమ సంస్కృతిలో కలవట్లేదంటూ, మీ వేషభాషలు వదలట్లేదంటూ

కల్లబొల్లి మాటలతో, సాధ్యంకాని వాగ్దానాలతో

కొందర్ని మభ్యపెట్టి, మరెందర్నో భయపెట్టి

నిద్రపోతున్న ప్రాంతీయతత్వాన్ని మేల్కొలిపి, రెచ్చగొట్టి

అందలమెక్కి, అధికార మదంతో, అదే పనిగా వేధిస్తూ..

మీరు వలసదారులు, తిరిగి పొండం”టుంటే,

ఎంత కష్టం, ఎంత నష్టం?

 

నాడు ఆంధ్ర రాష్ట్రం.. నేడు పడమర దేశం.. ఏముంది పెద్ద భేదం?

 

నా దేశంలో, నాది అనుకున్న భాగ్య నగరంలో, అవన్నీ సహించిన నాకు..

నాది కాని ఈ దేశపు పరాయి పొగరుమోతుల పాలనలో, ఇవన్నీ భరించడం.. ఏమంత కష్టం?


నిరంతర వైషమ్యాలతో నుండగా జనులెల్ల

కాదా వసుధైక కుటుంబం ఓ కల్ల!

ళుల్లు

ప్రేయసీ ప్రియులు. కాఫీ షాపు. చేతుల్లో చేతులు. కళ్ళల్లో కళ్ళు.

“రవీ.. నీకు అన్నిటికంటే ఏది ఇష్టం?”
“కల్లు..”
“ఛీ.. తాగుతావా?”
“ఆ కల్లు కాదు.. నీ కల్లు
“ఓహో”
“మరి.. నీకేమంటే ఇష్టం?”
“కలలు..”
“ఏం.. కంటావా?”
“అవి కాదు.. కలు, arts”
“ఆహా”

‘దొందూ దొందేరా కొందప్పా’.. అనుకున్నాడు అటుగా వెళ్తున్న ఓ తెలుగు పంతులు.

*****

తల్లిదండ్రులు. పిల్లల్ని కొత్తగా ‘మనబడి’లో చేర్చారు.

“hi, కల్యాన్!”
“hey, కిరన్!”
“మీ వాన్ని కూడా ఇక్కడ join చేసారా?”
“’మనబల్లో’ join చేస్తే తెలుగు బాగా వస్తుందని, వాల్లూ వీల్లూ చెప్తే..”

‘పిల్లలు కాదు.. మీరు చేరాలి ముందు’, టీచర్ గారి స్వగతం.

*****

పిల్లలు. అదే పనిగా వాదించుకుంటున్నారు.

“నువ్వే wrong..”
“కాదు.. నువ్వే wrong..”
ఇంతలో అటుగా వచ్చిన నాన్న.. “ఏంట్రా గొడవ?”
మొదటివాడు, “నువ్వు చెప్పు డాడీ.. house కి plural ఏంటి?”
“houses..”
“ఉహు.. తెలుగులో చెప్పు”
ఇంతలో రెండోవాడు.. “నేను చెప్తాను డాడీ, ‘ఇల్లు’”
వీడూరుకోడుగా, “కాదు, నువ్వు wrong, అది.. ‘ఇల్లు’”
ఇద్దర్నీ ఆపమన్న నాన్న.. “మీ ఇద్దరూ wrong.. అది.. ‘ఇల్లులు’”

*****

“ళ” – మన భాషకు ఎంతో ప్రత్యేకం.
ప్రత్యేకహోదా ఎలాగూ రాదు, కనీసం ప్రత్యేకతనైనా కాపాడుకుందాం!

భలే మంచి రోజు

సగం మూసిన కిటికీ తెరల నుంచి బారెడు పొద్దెక్కిన సూరీడు నిద్దర లేపుతుంటే,

బద్ధకం కూడా ఇంత హాయిగా ఉంటుందా?” అరుదుగా తప్ప ఇలాంటి అవకాశం రాని నేను,

పక్కపై ఇంకాసేపు దొర్లితే  తప్పేంట’నుకుంటున్నపుడు,

దిండుపై రాలిన జుట్టు రాబోయే దశాబ్దిని గుర్తు చేయగా,

తాపత్రయ పడే అర్ధాంగి తయారుచేసిన ఉల్లిపాయ గుజ్జుతో కాబోయే అరగుండుని కప్పేసి,

తలపై ఉండనిది ముఖంమీద మాత్రం ఎందుక’ని, కసితో క్షవరించి, ఆపై తలంటి,

నువ్వు.. నువ్వు.. నువ్వే.. నువ్వు..’ లాంటి మైమరపించే పాటలు వింటూ,

ముద్దపప్పూ ఆవకాయ గోంగూర నోరూరించగా వాటినీ అంతే ఇష్టంగా తింటూ,

ఎప్పుడూ ముక్తసరిగా మూడు ముక్కలు మాత్రమే మాట్లాడే అలవాటుని కాదని,

ఏకంగా రెండు గంటలు తనివి తీరా తల్లిదండ్రులతో స్కైపించి,

వాట్సాపు వాడకంలో వారెంత వెనకబడ్డారో గ్రహించి, అదెలా వాడాలో వివరించి ముగించే సరికి,

ఖాళీగా ఉన్న టీవీ.. “మరి నా సంగతో?” అని నన్ను దీనంగా అడగ్గా,

ఎన్నాళ్ళనుంచో చూద్దామనుకున్న ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లు గుర్తుకు వచ్చి,

వాటిని ఒక్కొక్కటిగా చూస్తున్నప్పుడు,

అనుభవం నేర్పే పాఠం, విజయం వెనుక పోరాటం, కుటుంబంకోసం పడే ఆరాటం

దాదాపు అందరి జీవితాల్లోనూ అగుపిస్తుండగా,

దాదాపు నాలుగు గంటల నుంచీ కళ్ళార్పకుండా చూస్తున్నానని, ఫోనులో వచ్చిన ఓ మెసేజ్ తట్టి చెప్పగా,

రేపటి ‘ఫాదర్స్ డే’ ని ఇవ్వాళే జరుపుకుందామని పిలిచిన స్నేహితులతో సరదాగా కాసేపు గడిపిన నాకు..

భార్యాపిల్లలు ఊళ్ళో లేని లోటుని పూరించి, మరిపించిన ఈ రోజు..

భలే మంచి రోజు!

శ్రీ దుర్ముఖి నామ ఉగాది శుభాకాంక్షలు

తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు – ఉగాది
ప్రేమ, సరసం, నమ్మకం, చురక, తగువు, అలక – కాపురం
ఆరోహణం, విరోధం, విరామం, ఊడిగం, విరమణం, అవరోహణం – ఉద్యోగం
సంతోషం, ఉల్లాసం, సుఖం, కోపం, దుఖం, కష్టం – జీవితం

అన్నీ సమపాళ్ళల్లో తీసుకున్నప్పుడు, ప్రతిదీ పండుగే, ప్రతిరోజూ ఉగాదే!

అభిరామ దశకం

పదో ఏడు. పిల్లాడు పెద్దాడయ్యే ఈడు.

బాల్యానికి దూరమౌతూ కౌమారానికి చేరువౌతుంటే..

అమాయకత్వమే తప్ప మరేదీ తెలీక, పరిచయంలేని మరో ప్రపంచం వైపు పరుగుపెడుతుంటే..

ఓ తండ్రి ఇచ్చే సూచన, దీవెన, బహుమానం.. అభిరామ దశకం.

 

పెద్దలని గౌరవించు.. పద్ధతులని పాటించు!

అల్పులని ఆదరించు.. తప్పులని మన్నించు!

ఉన్నదాన్ని అనుభవించు.. లేనిదాన్ని విస్మరించు!

ప్రతిభని గుర్తించు.. ఈర్ష్యని త్యజించు!

పరిసరాలని గమనించు.. కీడెంచి మేలెంచు!

మనసుని మందలించు.. బుధ్ధిని బుజ్జగించు!

నిరంతరం శ్రమించు.. లక్ష్యాన్ని సాధించు!

కష్టాన్ని అధిగమించు.. సంతోషాన్ని పంచు!

ప్రకృతిని ప్రేమించు.. జీవకోటిని రక్షించు!

పదోఏటిని స్వాగతించు.. పదిరెట్లు జీవించు!

సముద్రమెంత?

మొదటి సారి మహా సముద్రయానం చేసిన నాకు, అదో పెద్ద వింత
విశ్వమంటే తెలీని నాకు, బహుశా సముద్రమే విశ్వమంత

 

అన్ని వైపులా నీరే కనపడుతుంటే, ఆదీ అంతమూ లేదేమో అన్నంత
సుదూరానికి చూస్తుంటే, ఆకాశపుటంచుల్ని తాకుతున్నంత

 

ముందుకేమో చేరుకోలేనంత, వెనక్కేమో తిరిగి వెళ్ళలేనంత
గంట కునుకు తర్వాత లేచి చూసినా, ఒక ఇంచు కూడా కదలనంత

 

ఎంత దిగినా, లోతెంతో తెలియనంత
భూమి అంటే నీరేనేమో, నేల కాదేమో అన్నంత

 

సుడులు తిరిగే నీటిని చూస్తే, ఓ ప్రళయ మంత
ఊయలలూగే అలలను చూస్తే, మనసంతా ఓ పులకింత

 

ఎప్పుడూ నేలపై ఉండే నాకు, గోళాన్తర వాసమే ఇదంతా
నేల చాలని మనకు, నీరు కాదా మరో చెంత

 

ఇంతటి విశాల సముద్రమ్ముందు, అసలు నువ్వెంత నేనెంత
నీదీ నాదని  పంచుకోవాలనుకునే అల్పులమే కదా మనమంతా

ఓ బొజ్జ గణపయ్య

ఓ బొజ్జ గణపయ్య నీ దండు మేమయ్య
నీ పండుగంటేను మాకెంతొ ప్రియమయ్య!

ఉత్తరము దక్షిణము తూరుపూ పడమరయును
నీ భక్త జనకోటి మెండుగా ఉన్నాము!

అమెరికా ఇంగ్లండు జాపాను యూరప్పు
ఏ దేశమేగినా నీ పూజ నిష్ఠగా చేసుకొనుచున్నాము!

మూడైన ఐదైన ఏడైన ఎన్నైన
ప్రతి రాత్రి ఓ నవరాత్రి లాగున
నిత్య హారతి నీకు పట్టిస్తు ఉన్నాము!

నేరేడు మారేడు వెలగ తాంబూలమూ
ఏదున్న లేకున్న అన్నియూ మీరనుచు
ఉన్నవే భక్తితో పత్రిగా చేసితిమి!

కుడుములూ ఉండ్రాళ్ళు చలివిడీ వడపప్పు
చేయడము రాకున్న తీరికే లేకున్న
అన్నమూ పప్పుయే నైవేద్యమిచ్చాము!

శ్లోకాలు పద్యాలు పూజలూ మంత్రాలు
అర్ధమే కాకున్న శ్రద్ధతో చదివాము
చదవడమే రాకున్న బుద్ధిగా విన్నాము!

పిల్లలైతేమి పెరిగి పెద్దయితేమి
ఆంగ్లమైతేమి ఆంధ్రమైతేమి
అందరితొ పూజ చేయించినాము!

ఓ బొజ్జ గణపయ్య నీ దండు మేమయ్య
తప్పుజరిగితె మమ్ము మన్నించుమయ్య
విఘ్నములె రాకుండ దీవించుమయ్య!

మన తరమే

I recently overheard a conversation of two college-going Telugu-speaking youth and it went something like this..

“నిన్ననే afternoon show కి వెళ్ళా. నువ్వు?”
“నేను two days back already చూసేశా. taking మాత్రం super గా ఉందిరా. every scene లో richness కనపడింది. particular గా war sequence ఐతే ultimate.”
“నాకైతే background music mind blowing. one or two songs కూడా బానే ఉన్నాయి.”
“water fall backdrop scene కూడా బానే ఉంది కాని, కొంచెం unrealistic గా feel అయ్యాను.”

“అక్కడక్కడా కొన్ని silly mistakes. అవి కూడా avoid చేస్తే ఇంకా better గా ఉండేది.”
“climax కూడా interval లాగా తీసి tension పెడుతున్నాడు. overall గా ఐతే, movie super.”
“..”
“..”

ఇలా వాళ్ళ సంభాషణ నడుస్తూ ఉండింది. ఆ cinema గురించో, లేదా వాళ్ళ అభిప్రాయాల గురించో చర్చిండం నా ఉద్దేశం కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. గౌరవిద్దాం.

ఐతే, ఎవరూ గమనించని, బహుశా ఎవరూ చర్చించని, నాకు బాగా నచ్చిన, విషయం ఒకటుంది.. ఆ cinema లో మొత్తం మీద ఎక్కడా కూడా ఒక్క english పదం కూడా వాడలేదు.

“అందులో వింతేముంది? అది రాజుల కాలం నాటిది కాబట్టి, అందులో english వాడాల్సిన అవసరమే రాలేదు.” అని అంటారా? అవును. అసలు english వాడే అవకాశమే లేదు. కానీ, అదే cinema గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మాత్రం అటూ ఇటూ కాని భాషతో రెండు భాషల్నీ చిత్రవధకి గురిచేస్తున్నాం. కాదంటారా?

ఆ సంభాషణని మరో సారి గమనించండి. తెలుగు పదాలకంటే అరువు పదాలే ఎక్కువ కనపడుతున్నాయి. మన పదాలకోసం వెతుక్కోవలసి వస్తోంది. కానీ వినటానికి ఎంత సాధారణంగా తెలుగు లాగా అనిపిస్తోందో కదా!

మీరెప్పుడైనా ఇద్దరు బెంగాలీలు మాట్లాడుకుంటుంటే విన్నారా? ఒక్క ముక్కైనా మనకర్ధమవుతుందా? ఇక ఇద్దరు తమిళులు మాట్లాడుకుంటుంటే, అసలు అది తమిళమో మలయాళమో కూడా అర్ధం కాదు. అదే ఇద్దరు తెలుగు వాళ్ళు మాట్లాడుకుంటుంటే మాత్రం, కాసింత english వచ్చిన ఎవరికైనా ఇట్టే అర్ధం అవుతుంది.

గ్రాంధికం నుంచి వాచకం, వాచకం నుంచి జానపదం, జానపదం నుంచి వాడుకపదం. తరానికీ తరానికీ భాష కొంత రూపాంతరం చెందడం సహజం. కానీ, అంతరించి పోయేంతగా మార్పు చెందడం, అసలు తరచుగా వాడే కొన్ని ఆంగ్ల పదాలకి తెలుగు అర్ధం తెలీనంతగా మాయమవటం, మన దురదృష్టం. మనం చేసుకుంటున్న పాపం. మన తరం చేస్తున్న నేరం.

“మన తరమా?” అవును, కచ్చితంగా మన తరమే. తెలుగు సినిమాలలో వాడే తెలుగును గమనిస్తే, డెబ్బై ఎనభై ఏళ్ళ నాటి తెలుగు ఒక్క సారిగా భ్రష్టు పట్టి పరభాషా పంకిలమవటం, కేవలం మన తరంతోనే మొదలైంది. ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది. కారణాలు కర్ణుడి చావుకున్నన్ని. కానీ, బాధ్యులం మాత్రం మనమే.

వేమన పద్యాలూ, సుమతీ శతకాల వంటి అందరికీ (ఒకప్పుడు)అర్ధమయ్యే సూక్తి సంపదని ముందు తరాలకి అందించాలంటే, ముందుగా తెలుగుకు పట్టిన తెగులుని వదిలిద్దాం. This is not against speaking English language. I respect that language, for that matter, every language. తెలుగు వాక్యాలలో ఆంగ్ల పదాలు, ఇంట్లో అందమైన చెక్క దూలాలకి పట్టే చెద పురుగులు. అరికట్టకపోతే, ఇంటి దూలాలనీ చివరికి ఇంటినీ నాశనం చేస్తాయి. కాబట్టి, తెలుగులో మాట్లాడేటప్పుడు కేవలం తెలుగు పదాలనే వాడదాం, ఆంగ్ల పదాల వాడకాన్ని తగ్గిద్దాం, మన ఇంటిని కాపాడుకోవటానికి మన వంతు ప్రయత్నిద్దాం, భావి తరాలకి సొంత ఇంటి సౌందర్యాన్ని చెక్కు చెదరకుండా అందిద్దాం.

“ఇది సాధ్యమేనా? అంతా తెలుగులోనే మాట్లాడాలంటే కొంచెం ఎబ్బెట్టుగా ఉండదా?”. ఎందుకుంటుంది? ఆ సినిమా చూస్తున్నంతసేపూ, ఎప్పుడైనా ఎక్కడైనా ఎబ్బెట్టుగా అనిపించిందా? అచ్చ తెలుగు సినిమా ఆరు వందల కోట్లు సంపాదించడం సాధ్యమైనప్పుడు, తెలుగు వాళ్ళు అచ్చ తెలుగులో మాట్లాడుకోవటం కూడా సాధ్యమే. అది మన తరమే!

బామ్మ – మనవడు : Land of opportunities

బామ్మ: “హలో”
మనవడు: “యేమిటే, ఈ టైంలో..”
బా: “నిద్రపొయ్యావా? సరేగానీ, మరి.. మన డల్లాస్ నాగేశ్వర్రావ్ గారి మనవడి కొడుకు పుట్టినరోజు రేపు చేసుకుంటున్నారంట, ఒక సారి వెళ్ళి రారాదూ!”
: “నేనిప్పుడు డల్లాస్ లో లేనే”

బా: “అదే(, మొన్నీమధ్యేగా చికాగో సుబ్బారావ్ గారి వూరి నుంచి డల్లాస్ వచ్చానన్నావ్?”
: “అది రెండు నెల్ల క్రితం మాట. ఇప్పుడు కొలరాడో అనీ ఇంకో ఊర్లో ఉంటున్నాలే”
బా: “ఇదేమి కొలవెరి రా.. ఇలా రెండు నెల్లకోసారి ఊరు మారటమేమిటొ, నాకంతుపట్టట్లా. మన బెంగుళూరు బాలరాజు గారి మనవడు పదిహేనేళ్ళనుంచి శుభ్రంగా బెంగుళూరు లోనే ఉద్యోగం చేస్తున్నాడు.. కుండ కదలకుండా”
: “ఐతే యేమంటావే ఇప్పుడు?..”
బా: “నేననేదేముంది.. నువ్వే అప్పుడు అమేరికాని అదేదో అంటారని చెప్పి వెళ్ళావుగా..”
: “అదా.. Land of opportunities అనీ..”
బా: “అంటే?”
: “అది నీకర్ధం కాదులేవే.. సరే, నాకు ఒక ఇంటర్వూ కాల్ ఉంది, డెట్రాయిట్ లో నీకు తెలిసిన వాళ్ళుంటే చెప్పు, మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తా, బాయ్”
బా: “??”

బామ్మ – మనవడు : Quality of life

బామ్మ: “హలో..”
మనవడు: “హలో..”
బామ్మ: “ఏరా బడుధ్ధాయ్, యేం చేస్తున్నావ్”
మనవడు: “ఆ( యేముందే, అమేరికాలో అందరు మగవాళ్ళు ఏం చేస్తారో, నేనూ అదే చేస్తున్నా”
బామ్మ: “అర్ధం కాలా..!”
మనవడు: “అదేనే, అంట్లు తోముతున్నా”
బామ్మ: “అదేం? అప్పుడు.. అదేంటి.. అదేదో చెప్పి మరీ అమేరికా వెళ్ళావ్?”
మనవడు: “అదా.. Quality of life అనీ..”
బామ్మ: “అంటే?”
మనవడు: “అది నీకర్ధం కాదులేవే.. సరే, నాకు బాత్రూంలో కొంచెం పని ఉంది, మళ్ళీ ఫోన్ చేస్తా, బాయ్”
బామ్మ: “??”