ఆ రాత్రి..
పైశాచికత్వం పేట్రేగిన ప్రళయరాత్రి
మానవత్వం మంటకలిసిన మృత్యురాత్రి
అది ఓ కాళరాత్రి, చితి మండిన నిశిరాత్రి!
ఆ రాత్రీ.. ప్రతి రాత్రీ.. ప్రతి రోజూ..
ఏదో చోట.. ఓ మృత్యుఘోష
ఓ అభాగ్యురాలి ఆవేదన
ఓ నిస్సహాయురాలి నిర్వేదం!
ఆ వేదనే.. ఈ నా “స్త్రీ విలాపం!”
నేను ఆదిశక్తినని చాటొద్దు,
దేవతలా పూజించొద్దు
నన్ను భూమాతతో పోల్చొద్దు,
అమ్మగా అనుకోనూవొద్దు
నాలో ఓ అక్కని చూడొద్దు,
ఓ చెల్లినీ చూడొద్దు
ఓ మనిషీ..
దయచేసి..
నన్నూ ఓ మనిషిలా చూడు!
నీకు లాగే నాకు కూడా..
వేధిస్తే బాధ కలుగుతుందనీ
వెంటాడితే భయం వేస్తుందనీ
ఆసిడ్ వేస్తే వళ్ళు కాలుతుందనీ
ముక్కు మూస్తే ఊపిరాగుతుందనీ
నీకే జరిగినట్టు ఊహించుకుని, గుర్తుంచుకుని
నన్నూ ఓ జీవమున్న ప్రాణిలా బ్రతకనీ!
నీకు తెలుసా..
ఒళ్ళంతా ముళ్ళు గుచ్చితే ఎలా ఉంటుందో?
సిగ్గొదిలి చూసే నీ చూపులనడుగు!
నీకు తెలుసా..
ఒంటిమీద తేళ్లు పాకితే ఎలా అనిపిస్తుందో?
వికృతంగా తడిమే నీ చేతులనడుగు!
దయచేసి..
కళ్ళతోటే కుళ్లబొడవొద్దు
చేతలతోటే చిదిమెయ్యొద్దు
ఆడదాన్ని ఆశగా చూడొద్దు
అబలని అవకాశంగా వాడొద్దు!
ఓ మనిషీ..
దయచేసి..
నా మానం నాకొదిలెయ్
నా మానాన నన్నొదిలెయ్!
నా పరువు నాకుంచెయ్
నా ప్రాణం నాకిచ్చెయ్!