ఈ మధ్యనే, ఒక అందమైన సముద్రపు ఒడ్డున విహారానికి వెళ్ళినప్పుడు, సముద్రపు అలలు చేసే విన్యాసాలనూ, ఆ అలలతో చిన్నాపెద్దా ఆడే ఆటలనూ, నేను ఉల్లాసంగా గమనిస్తున్నప్పుడు, నాలో దొరలిన చిరు అనుభూతుల మాల.. ఈ “అల”!
‘అల’ను మించిన చెలిమి లేదు
రోజంతా ఆడినా అలుపు రాదు
అల్లంత దూరం నుంచీ తీరందాకా వస్తుంది
పాలపొంగు నురగతో చిలిపి అల్లరి చేస్తుంది
పున్నమి వెన్నెల కాంతిని పరుచుకుని వస్తుంది
రంగుల వన్నెల గవ్వలను మోసుకుని తెస్తుంది
పడినా మళ్ళీ లేవాలని పదే పదే చెబుతుంది
దూరం ఎంతైనా తీరం చేరాలనే చెబుతుంది
అలసి సొలసిన మనసులకు విశ్రాంతినిస్తుంది
భావ కవితల భావుకులకు ప్రేరణనిస్తుంది
జంట ప్రేమికుల పాదాలను ప్రేమతో పలకరిస్తుంది
చిన్నారుల ఇసుక గూళ్ళను లాలితో ముద్దాడుతుంది
రేతిరంతా తోడులేరని హోరున ఘోషిస్తుంది
తెల్లవారి వేకువకోసం ఆతృతగా వేచిచూస్తుంది
మరోరోజు మరెందరినో మైమరపించడానికి
తెరలు తెరలుగా తీరానికి తరలి వస్తూనే ఉంటుంది!
మిత్రమా..
అలాంటి అలను, అలాంటి చెలిమిని మలినం చెయ్యటం తగునా?
సముద్రతీరానికి అర్ధంలేని పాస్టిక్ వ్యర్ధంతో తీరని అనర్ధం.. భావ్యమా?
అసలు.. అల తలచుకుంటే ప్రళయం కష్టమా?
స్నేహం సునామీగా మారితే మనకే నష్టం సుమా!
Very well written. Thank you.
LikeLike
Thank you, Sir.
LikeLike