‘రిపబ్లిక్’ అనే సినిమా చూసి ముగింపుకి చలించినా, సదరు వ్యవస్థ మార్పుకి ఏమీ చెయ్యలేక సిగ్గుపడినా,నేలకొరిగిన ఎందరో అనామక వీరులని క్షమాపణలు కోరడం తప్ప.. ‘ఇంకేం చేయగలం’
కులానికి ఓటేసే మనం ఇంకేం చేయగలం..
ప్రజాస్వామ్యాన్ని కాటేయడం తప్ప.
మతానికి పూతవేసే మనం ఇంకేం చేయగలం..
దేశాన్ని పాతరేయడం తప్ప.
స్వార్ధంతో కుళ్లిపోయిన మనం ఇంకేం చేయగలం..
సమాజాన్ని కుళ్లబొడవడం తప్ప.
స్కీములకి అలవాటుపడ్డ మనం ఇంకేం చేయగలం..
స్కాములకి సర్దుకుపోవడం తప్ప.
అసలైన నాయకుడి కోసం ఎటెటో చూసే మనం,
ఆ నాయకుడు మనలోంచే వస్తే ఎలా సహించగలం..
పడదోసే అదును కోసం కాచుక్కూర్చోడం తప్ప.
దేశాన్ని ఎప్పుడూ నిందించే మనం ఇంకేం చేయగలం..
పరదేశానికి పరుగులు పెట్టడం తప్ప.
తెల్లారేసరికల్లా చల్లారిపోయే మనం ఇంకేం చేయగలం..
ఓ పూట సినిమా చూసి తొంగోడం తప్ప..
ఓటిటి లో మరోటి చూసి నిన్నటిది మర్చిపోవడం తప్ప.