God is there..
all His ears!
I am sure..
He will hear!
Let me wish..
loud and clear!
May this year..
bring you more cheer!
Oh my dear..
oh my dear!
Wish you all..
a Happy New Year!
అభిప్రాయానికి అక్షరాన్ని అద్దుతూ, భావాన్ని భాషతో దిద్దుతూ..
God is there..
all His ears!
I am sure..
He will hear!
Let me wish..
loud and clear!
May this year..
bring you more cheer!
Oh my dear..
oh my dear!
Wish you all..
a Happy New Year!
కాకరొత్తులు మెరుస్తూ
చిచ్చుబుడ్లు వెలుగుతూ
టపాసులు పేలుతూ
భూవిష్ణు చక్రాలు తిరుగుతూ
ఇంటిముందు దీపాలు వీధిలోని చీకటిని తరుముతుంటే
ఊరంతా దీపావళి!
నరుడిలోనే నరకుడు
మానవుడిలోనే మాధవుడు
మనలోని నరకుణ్ణి
మనలేని అసురుణ్ణి చేస్తూ
మనలోని మాధవుడు నిరంతరం ప్రయత్నిస్తే
బ్రతుకంతా దీపావళి!
ప్రమాదాలతో కాక, ప్రమోదాలతో మీరీ పండుగ చేసుకోవాలని ఆశిస్తూ
దీపావళి శుభాకాంక్షలు!
If you find reading Telugu difficult, listen to my audio right here.
జగమంతటికీ శ్రీరాముడే రక్ష
చెల్లికి మాత్రం అన్నయ్యే శ్రీరామరక్ష!
అన్నయ్యకి తాను చెల్లి
తమ్మునికైతే ఆమే తల్లి!!
ఆ అనుబంధాన్ని గుర్తు చేస్తూ, సోదరభావాన్ని పెంచేదే రక్షాబంధనం!!!
అన్నాచెల్లెళ్లకి, అక్కాతమ్ముళ్ళకి,
ఆడవాళ్ళని అక్కాచెల్లెళ్ళుగా భావించే అన్నాతమ్ముళ్ళకి
రక్షాబంధన శుభాకాంక్షలు!
If you find reading Telugu difficult, listen to my audio right here.
కనుచూపు మేరలో పచ్చదనం
కాలుష్యం దరిచేరని వాతావరణం
ముంగిట్లో పూల మొక్కలు
పెరట్లో పళ్ళ తోటలు
ఇంటి ముందే సాగర కాలువ
ఆమడ దూరంలో సంగమ చెరువు
కల్తీ కలవని పాలూ పెరుగు
మందే ఎరుగని పళ్ళూ కూరలు
అప్పుడే పట్టిన చేపల పులుసు
అక్కడే కత్తిన నాటుకోడి వేపుడు
నిన్నే తెంచిన బీర కూర
మొన్నే ఈనిన గేదె జున్ను
సన్నగా తురిమిన లేతకాకర
మెత్తగా నూరిన కరివేపాకు
గడ్డ పెరుగు
కొసరి వడ్డన
ఆహా! స్వర్గం మరెక్కడో లేదు
నిజామాబాదుకు పడమర
పాతిక కిలోమీటర్ల దూరాన
పల్లెంపాటివారి ఆతిథ్యంలో!
If you find reading Telugu difficult, listen to my audio right here.
ఈ దేశంలో అట్టి పార్కు మరోటి లేదని
ఎంతోమంది నాకు పట్టి పట్టి చెప్పగా
చిన్ననాటి స్నేహితులతో జట్టుకట్టి
ఓ మినీవాను బాడుగ కట్టి
పట్టుమని మూడు గంటలైనా గడవకముందే
చేరుకున్న ఆ చిట్టడవే
కట్టి పడేసే అందాల యూసమేట్టి
పార్కునంతా కలియ జుట్టి
మిట్టమధ్యాహ్నమైనా సరే
పట్టువదలని విక్రమార్కుల్లా
దట్టమైన చెట్టు నీడల సాయంతో
మెట్టు మెట్టు ఎక్కుతూ
ఎట్టకేలకు కొండపైకి చేరుకుంటే
కళ్ళకు కట్టిన ఆ ఎత్తైన జలపాతాలతో
నిరంతరం ఘోషించే యూసమేట్టి
ఉరుకుల పరుగులతో బిరబిర జారే జలపాతాలను చూసినప్పుడు జాలువారిన ఈ చిరుకవితే: జలపాతాలు
కరిగే మంచు ఉరికే నీరు
మానవజాతికి వెలుగును ఇచ్చే శక్తిని దాచుకు
పద పద ముందుకు పద పద తోసుకు
మింటిని వదిలి నేలకు ధారగ
శిలలను నురగల అభిషేకించగ
పద పద ముందుకు పద పద తోసుకు
ఎగసే తెంపరి తుంపర మేఘం
తెల్లని మబ్బుకు బాటలు వేయగ
పద పద ముందుకు పద పద తోసుకు
నురగల పరుగుల వేగం పెరగగ
చెట్టూ పుట్టా రాయీ రప్పా అన్నీ కలుపుకు
పద పద ముందుకు పద పద తోసుకు
కొండను చీల్చుకు బండను పెగల్చుకు
వచ్చే తొలకరి మొక్కలకాయువు పోస్తూ
పద పద ముందుకు పద పద తోసుకు
నిటారు చెట్లే నిలువెత్తు సాక్షిగ
దశదశాబ్దాల నిరంతర ప్రవాహమై
పద పద ముందుకు పద పద తోసుకు
కొండలైన కరిగేలా బండలైన జారేలా
ప్రతాపాల ప్రవాహమై అలుపెరగక
పద పద ముందుకు పద పద తోసుకు
అడ్డొచ్చే రాయెంతెత్తుంటే అంతెత్తుకు లేస్తూ
మొండి కొండలను తప్పుకు పోతూ ఏదేమైనా
పద పద ముందుకు పద పద తోసుకు
అందాల మకరందాల నిలయమే కాదు.. ఎన్నో జీవితసత్యాలను కూడా నర్మగర్భంగా చెప్పే యూసమేట్టి యూసమేట్టి!
If you find reading Telugu difficult, listen to my audio right here..
పల్లెలు వదిలి పట్నాలెళ్తే, అవి ఉద్యోగాలు!
పట్నాలు వదిలి పల్లెలకొస్తే, అవి పండుగలు!
సాలుకి ఒకసారైనా ఊరంతా కలిస్తే, అదే సంక్రాంతి!
పల్లెకు పూర్వ వైభవం తెచ్చే ఆ క్రాంతే, మకర సంక్రాంతి!
మీ ఊళ్ళో ఉన్నా ఏ ఊళ్ళో ఉన్నా, ఈ సంక్రాంతి మీ ఇంట సుఖశాంతుల క్రాంతులు విరజిమ్మాలని ఆశిస్తూ..
సంక్రాంతి శుభాకాంక్షలు!
If you find reading Telugu difficult, listen to my audio right here.
నాలాంటి ఒక సగటు తెలుగు భాషాభిమానికి, ఇలాంటి వేడుక ఒక పండుగతో సమానం!
దీనిని ఇంత అట్టహాసంగా జరిపించటం ఆశ్చర్యకరం!
అలాంటి వేడుకని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం రావటం నా అదృష్టం!
తెలుగు భాష సంరక్షణకి ఎవరు నడుం బిగించినా, అది అభినందనీయం!
ఇంత పెద్ద వేడుకలో చిన్న చిన్న పొరపాట్లు సహజం, క్షమార్హం!
కానీ, భాషకి ప్రాంతీయతని ఆపాదించడం అన్యాయం!
ఎల్లలు లేని భాషకి గిరి గీయాలనుకోవడం మూర్ఖత్వం!
పోతన, సోమన, కాళోజీ, సినారె, దాశరధి, సురవరం..
ఇదివరకూ నాకు తెలుగు కవులుగానే పరిచయం..
కానీ, వారు తెలుగు కాదు.. తెలంగాణా కవులని చెప్పిన సదరు సభా నిర్వాహకుల నిర్వాకం, ఆ మహా కవులని అవమానపరచడం!
మరెందరో తెలుగు సాహితీవేత్తలని ప్రాంతీయవాదంతో ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించడం, తెలుగు సాహిత్యాన్ని అగౌరవపరచడం!
ఆంగ్లగాలికి రెపరెప లాడుతున్న తెలుగుదివ్వెను కొండెక్కకుండా చూసుకోవడం మనందరి కర్తవ్యం!
అందుకు, తెలుగుకు రెండు చేతులైన రెండు రాష్ట్రాల పరస్పర సహకారం ఎంతైనా అవసరం!
ప్రాంతీయతత్వాన్ని పక్కనపెడదాం, అధికారమదాంధులకి సరైన దారి చూపుదాం!
కమ్మనైన అమ్మ భాషని కాపాడుకోవటానికి చేయి చేయి కలుపుదాం.. సభలను మరచి, ప్రాంతాలకతీతంగా!
If you find reading Telugu difficult, listen to my audio right here.
హ్యూస్టన్ పై హార్వే చాచిన కోరలు
గాలీ వానల ఉధృత హోరులు
గోదారులుగా మారిన రాదారులు
సాయానికై ఎందరో అర్రులు
అందించిన మరెందరో వీరులు
ఐనా, రాబందుల్లా కొందరు చోరులు
ఆందోళనలో నగర పౌరులు!
ఎండిన గ్యాసు బోరులు
వాహనదారులంతా బేజారులు
బంకుల్లో బారులు తీరిన కారులు
ఇబ్బందుల్లో ఇంకెన్నో ఊరులు!
ప్రకృతికెందుకో మనపై అంత గుర్రులు
శ్రుతిమించామనేమో, ఆ చిర్రు బుర్రులు!
If you find reading Telugu difficult, listen to my audio right here.
పులంటే భయం
తొండంటే జుగుప్స
పామంటే వణుకు
తోడేలంటే బెదురు
ముంగీసంటే కంగారు
ఒంటెఅంటే వాసన
గాడిదంటే చులకన
కానీ..
వాటిని కలిశాక
ఒళ్లో ఆడించాక
తలపై తడిమాక
మెడపై నిమిరాక
ఆపై ముద్దాడాక
ఇంకేముంది..
జంతుప్రేమంటే ఇదికాక!
అలా సరదాగా గడిపాక
అటుపై ఇంటికి వచ్చాక
ఆ రాత్రి..
ఎందుకో నా కళ్ళల్లో పదేపదే మెదలు
పులిపిల్ల మొఖంలో ఏదో దిగులు
మనసులో మొదలైన చిన్న గుబులు
అనుమానంతో ఓసారి చేశాను గూగులు
జంతుశాలలన్నీ మహా పెద్ద స్కాములు!
పరిరక్షణ పేరుతో
క్రమశిక్షణ సాకుతో
స్వేచ్ఛను హరించే
నిర్దయతో బంధించే
మనుషులంటే.. మహా కోపం
మనమే వాటిపాలిట శాపం!
ఇంత చిన్న బోనులో అంత పెద్ద పులా?
అదీ జీవితాంతం! ఎలా?
మనిషా.. పులా? ఎవరు మృగం?
If you find reading Telugu difficult, listen to my audio right here.
కష్టనష్టాలకోర్చి సంపాదించుకున్న కంప్యూటర్ ఉద్యోగాలూ
ఆ సంపాదననే నమ్ముకుని బోలెడంత అప్పుచేసి కొన్న ఇల్లూ
పిల్లవాడి భవిష్యత్తుకై కన్న కలలూ, పెంచుకున్న ఆశలూ
చుట్టూ చెంతగా, అండగా ఉన్న స్నేహితులూ
ఇక్కడే స్థిరపడొచ్చని ఒక్కొక్కరుగా వచ్చి దగ్గరైన బంధువులూ
వాళ్ళతో తరచుగా జరిపే విహారాలూ, వినోదాలూ..
ఒక్కసారిగా.. “మీవి కాదం”టే.. “మీరు వద్దు, పో పొమ్మం”టే
ఎంత కష్టం, ఎంత నష్టం?
ఉద్యోగాలు లాగేసుకుంటున్నారంటూ, ఆస్తులు కూడబెట్టుకుంటున్నారంటూ
తమ సంస్కృతిలో కలవట్లేదంటూ, మీ వేషభాషలు వదలట్లేదంటూ
కల్లబొల్లి మాటలతో, సాధ్యంకాని వాగ్దానాలతో
కొందర్ని మభ్యపెట్టి, మరెందర్నో భయపెట్టి
నిద్రపోతున్న ప్రాంతీయతత్వాన్ని మేల్కొలిపి, రెచ్చగొట్టి
అందలమెక్కి, అధికార మదంతో, అదే పనిగా వేధిస్తూ..
“మీరు వలసదారులు, తిరిగి పొండం”టుంటే,
ఎంత కష్టం, ఎంత నష్టం?
నాడు ఆంధ్ర రాష్ట్రం.. నేడు పడమర దేశం.. ఏముంది పెద్ద భేదం?
నా దేశంలో, నాది అనుకున్న భాగ్య నగరంలో, అవన్నీ సహించిన నాకు..
నాది కాని ఈ దేశపు పరాయి పొగరుమోతుల పాలనలో, ఇవన్నీ భరించడం.. ఏమంత కష్టం?
నిరంతర వైషమ్యాలతో నుండగా జనులెల్ల
కాదా వసుధైక కుటుంబం ఓ కల్ల!
If you find reading Telugu difficult, listen to my audio right here.