ఈ దేశంలో అట్టి పార్కు మరోటి లేదని
ఎంతోమంది నాకు పట్టి పట్టి చెప్పగా
చిన్ననాటి స్నేహితులతో జట్టుకట్టి
ఓ మినీవాను బాడుగ కట్టి
పట్టుమని మూడు గంటలైనా గడవకముందే
చేరుకున్న ఆ చిట్టడవే
కట్టి పడేసే అందాల యూసమేట్టి యూసమేట్టి
పార్కునంతా కలియ జుట్టి
మిట్టమధ్యాహ్నమైనా సరే
పట్టువదలని విక్రమార్కుల్లా
దట్టమైన చెట్టు నీడల సాయంతో
మెట్టు మెట్టు ఎక్కుతూ
ఎట్టకేలకు కొండపైకి చేరుకుంటే
కళ్ళకు కట్టిన ఆ ఎత్తైన జలపాతాలతో
నిరంతరం ఘోషించే యూసమేట్టి యూసమేట్టి
ఉరుకుల పరుగులతో బిరబిర జారే జలపాతాలను చూసినప్పుడు జాలువారిన ఈ చిరుకవితే: జలపాతాలు
కరిగే మంచు ఉరికే నీరు
మానవజాతికి వెలుగును ఇచ్చే శక్తిని దాచుకు
పదండి ముందుకు పదండి తోసుకు
మింటిని వదిలి నేలకు ధారగ
శిలలను నురగల అభిషేకించగ
పదండి ముందుకు పదండి తోసుకు
ఎగసే తెంపరి తుంపర మేఘం
తెల్లని మబ్బుకు బాటలు వేయగ
పదండి ముందుకు పదండి తోసుకు
నురగల పరుగుల వేగం పెరగగ
చెట్టూ పుట్టా రాయీ రప్పా అన్నీ కలుపుకు
పదండి ముందుకు పదండి తోసుకు
కొండను చీల్చుకు బండను పెగల్చుకు
వచ్చే తొలకరి మొక్కలకాయువు పోస్తూ
పదండి ముందుకు పదండి తోసుకు
నిటారు చెట్లే నిలువెత్తు సాక్షిగ
దశదశాబ్దాల నిరంతర ప్రవాహమై
పదండి ముందుకు పదండి తోసుకు
కొండలైన కరిగేలా బండలైన జారేలా
ప్రతాపాల ప్రవాహమై అలుపెరగక
పదండి ముందుకు పదండి తోసుకు
అడ్డొచ్చే రాయెంతెత్తుంటే అంతెత్తుకు లేస్తూ
మొండి కొండలను తప్పుకు పోతూ ఏదేమైనా
పదండి ముందుకు పదండి తోసుకు
అందాల మకరందాల నిలయమే కాదు.. ఎన్నో జీవితసత్యాలను కూడా నర్మగర్భంగా చెప్పే యూసమేట్టి యూసమేట్టి!
If you find reading Telugu difficult, listen to my audio right here..