ఆఫీస్ లో ఉన్నా, ఇంట్లో ఉన్నా,
షాపింగ్ కెళ్లినా, సినిమాకొచ్చినా,
పక్క మీదున్నా, పక్కూరెళ్లినా,
పడుకునే ముందూ, నిద్ర లేచాకా,
మధ్యలో మెలకువొచ్చినప్పుడల్లా,
ఎప్పుడూ పని పని పని పని
అని, పని గురించే ఆలోచిస్తూ,
మెదడుకి ఏమాత్రం విశ్రాంతి లేకుండా
నిరంతరం శ్రమించే సాఫ్ట్ వేర్ శ్రామికులారా..
వెన్ను వంగక
మెడ తిరగక
తిన్నదరగక
కునుకు పట్టక
ఆరోగ్యాన్ని త్యాగం చేస్తూ..
నిద్ర చాలక
సమయం దొరకక
భార్యతో గడపక
పిల్లల్తో ఆడక
సంసారంలో రాజీ పడ్తూ..
వయసు పెరిగాక
అవకాశాలు తగ్గాక
టెక్నాలజీ మారాక
కొత్తది అర్ధంకాక
కుర్రకారుతో పోటీ పడుతూ..
ఎకానమీ బాగోక
ప్రమోషన్లు రాక
జీతాలు పెరగక
ఉన్నది ఎప్పుడూడుతుందో తెలీక
అనిశ్చితితో కుస్తీ పడ్తూ..
ప్రపంచానికి విజ్ఞాన వెలుగులనందించడానికి
తాము నలిగిపోతూ, సమిధలౌతూ
మానవాళిని నవయుగం వైపు
ప్రగతి పథంలో నడిపిస్తున్న
సాంకేతిక విప్లవ వీరులారా..
శ్రామిక దినోత్సవ సందర్బంగా, మనకివే నా జోహార్లు!