ఓ బొజ్జ గణపయ్య నీ దండు మేమయ్య
నీ పండగంటేను మాకెంతొ ప్రియమయ్య!
ఉత్తరము దక్షిణము తూరుపూ పశ్చిమము
నీ భక్త జనకోటి మెండుగా ఉన్నాము!
అమెరికా ఇంగ్లండు జాపాను యూరప్పు
దేశమేదైనా పూజ నిష్ఠగా చేశాము!
మూడైన ఐదైన ఏడైన ఎన్నైన
ప్రతి రాత్రి ఓ నవరాత్రి లాగున
నిత్యహారతి నీకు పట్టించినాము!
కుడుములూ ఉండ్రాళ్ళు చలివిడీ వడపప్పు
చేయనే రాకున్న తీరికే లేకున్న
బెల్లమూ పప్పులే నైవేద్యమిచ్చాము!
నేరేడు మారేడు వెలగ తాంబూలమూ
ఏదున్న లేకున్న ఉన్నదే అంతనుచు
పూలనే భక్తితో పత్రిగా చేశాము!
శ్లోకాలు పద్యాలు పూజలూ మంత్రాలు
అర్ధమే కాకున్న శ్రద్ధగా చదివాము
చదువనే రాకున్న బుద్ధిగా విన్నాము!
పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి
ఆంగ్లమైతేనేమి ఆంధ్రమైతేనేమి
అందరితొ నీ పూజ చేయించినాము!
ఓ బొజ్జ గణపయ్య నీ దండు మేమయ్య
తప్పుజరిగితె మమ్ము మన్నించుమయ్య
విఘ్నములె రాకుండ దీవించుమయ్య!