మన తరమే

I recently overheard a conversation of two college-going Telugu-speaking youth and it went something like this..

“నిన్ననే afternoon show కి వెళ్ళా. నువ్వు?”
“నేను two days back already చూసేశా. taking మాత్రం super గా ఉందిరా. every scene లో richness కనపడింది. particular గా war sequence ఐతే ultimate.”
“నాకైతే background music mind blowing. one or two songs కూడా బానే ఉన్నాయి.”
“water fall backdrop scene కూడా బానే ఉంది కాని, కొంచెం unrealistic గా feel అయ్యాను.”

“అక్కడక్కడా కొన్ని silly mistakes. అవి కూడా avoid చేస్తే ఇంకా better గా ఉండేది.”
“climax కూడా interval లాగా తీసి tension పెడుతున్నాడు. overall గా ఐతే, movie super.”
“..”
“..”

ఇలా వాళ్ళ సంభాషణ నడుస్తూ ఉండింది. ఆ cinema గురించో, లేదా వాళ్ళ అభిప్రాయాల గురించో చర్చిండం నా ఉద్దేశం కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. గౌరవిద్దాం.

ఐతే, ఎవరూ గమనించని, బహుశా ఎవరూ చర్చించని, నాకు బాగా నచ్చిన, విషయం ఒకటుంది.. ఆ cinema లో మొత్తం మీద ఎక్కడా కూడా ఒక్క english పదం కూడా వాడలేదు.

“అందులో వింతేముంది? అది రాజుల కాలం నాటిది కాబట్టి, అందులో english వాడాల్సిన అవసరమే రాలేదు.” అని అంటారా? అవును. అసలు english వాడే అవకాశమే లేదు. కానీ, అదే cinema గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మాత్రం అటూ ఇటూ కాని భాషతో రెండు భాషల్నీ చిత్రవధకి గురిచేస్తున్నాం. కాదంటారా?

ఆ సంభాషణని మరో సారి గమనించండి. తెలుగు పదాలకంటే అరువు పదాలే ఎక్కువ కనపడుతున్నాయి. మన పదాలకోసం వెతుక్కోవలసి వస్తోంది. కానీ వినటానికి ఎంత సాధారణంగా తెలుగు లాగా అనిపిస్తోందో కదా!

మీరెప్పుడైనా ఇద్దరు బెంగాలీలు మాట్లాడుకుంటుంటే విన్నారా? ఒక్క ముక్కైనా మనకర్ధమవుతుందా? ఇక ఇద్దరు తమిళులు మాట్లాడుకుంటుంటే, అసలు అది తమిళమో మలయాళమో కూడా అర్ధం కాదు. అదే ఇద్దరు తెలుగు వాళ్ళు మాట్లాడుకుంటుంటే మాత్రం, కాసింత english వచ్చిన ఎవరికైనా ఇట్టే అర్ధం అవుతుంది.

గ్రాంధికం నుంచి వాచకం, వాచకం నుంచి జానపదం, జానపదం నుంచి వాడుకపదం. తరానికీ తరానికీ భాష కొంత రూపాంతరం చెందడం సహజం. కానీ, అంతరించి పోయేంతగా మార్పు చెందడం, అసలు తరచుగా వాడే కొన్ని ఆంగ్ల పదాలకి తెలుగు అర్ధం తెలీనంతగా మాయమవటం, మన దురదృష్టం. మనం చేసుకుంటున్న పాపం. మన తరం చేస్తున్న నేరం.

“మన తరమా?” అవును, కచ్చితంగా మన తరమే. తెలుగు సినిమాలలో వాడే తెలుగును గమనిస్తే, డెబ్బై ఎనభై ఏళ్ళ నాటి తెలుగు ఒక్క సారిగా భ్రష్టు పట్టి పరభాషా పంకిలమవటం, కేవలం మన తరంతోనే మొదలైంది. ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది. కారణాలు కర్ణుడి చావుకున్నన్ని. కానీ, బాధ్యులం మాత్రం మనమే.

వేమన పద్యాలూ, సుమతీ శతకాల వంటి అందరికీ (ఒకప్పుడు)అర్ధమయ్యే సూక్తి సంపదని ముందు తరాలకి అందించాలంటే, ముందుగా తెలుగుకు పట్టిన తెగులుని వదిలిద్దాం. This is not against speaking English language. I respect that language, for that matter, every language. తెలుగు వాక్యాలలో ఆంగ్ల పదాలు, ఇంట్లో అందమైన చెక్క దూలాలకి పట్టే చెద పురుగులు. అరికట్టకపోతే, ఇంటి దూలాలనీ చివరికి ఇంటినీ నాశనం చేస్తాయి. కాబట్టి, తెలుగులో మాట్లాడేటప్పుడు కేవలం తెలుగు పదాలనే వాడదాం, ఆంగ్ల పదాల వాడకాన్ని తగ్గిద్దాం, మన ఇంటిని కాపాడుకోవటానికి మన వంతు ప్రయత్నిద్దాం, భావి తరాలకి సొంత ఇంటి సౌందర్యాన్ని చెక్కు చెదరకుండా అందిద్దాం.

“ఇది సాధ్యమేనా? అంతా తెలుగులోనే మాట్లాడాలంటే కొంచెం ఎబ్బెట్టుగా ఉండదా?”. ఎందుకుంటుంది? ఆ సినిమా చూస్తున్నంతసేపూ, ఎప్పుడైనా ఎక్కడైనా ఎబ్బెట్టుగా అనిపించిందా? అచ్చ తెలుగు సినిమా ఆరు వందల కోట్లు సంపాదించడం సాధ్యమైనప్పుడు, తెలుగు వాళ్ళు అచ్చ తెలుగులో మాట్లాడుకోవటం కూడా సాధ్యమే. అది మన తరమే!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: