సగం మూసిన కిటికీ తెరల నుంచి బారెడు పొద్దెక్కిన సూరీడు నిద్దర లేపుతుంటే,
“బద్ధకం కూడా ఇంత హాయిగా ఉంటుందా?” అరుదుగా తప్ప ఇలాంటి అవకాశం రాని నేను,
‘పక్కపై ఇంకాసేపు దొర్లితే తప్పేంట’నుకుంటున్నపుడు,
దిండుపై రాలిన జుట్టు రాబోయే దశాబ్దిని గుర్తు చేయగా,
తాపత్రయ పడే అర్ధాంగి తయారుచేసిన ఉల్లిపాయ గుజ్జుతో కాబోయే అరగుండుని కప్పేసి,
‘తలపై ఉండనిది ముఖంమీద మాత్రం ఎందుక’ని, కసితో క్షవరించి, ఆపై తలంటి,
‘నువ్వు.. నువ్వు.. నువ్వే.. నువ్వు..’ లాంటి మైమరపించే పాటలు వింటూ,
ముద్దపప్పూ ఆవకాయ గోంగూర నోరూరించగా వాటినీ అంతే ఇష్టంగా తింటూ,
ఎప్పుడూ ముక్తసరిగా మూడు ముక్కలు మాత్రమే మాట్లాడే అలవాటుని కాదని,
ఏకంగా రెండు గంటలు తనివి తీరా తల్లిదండ్రులతో స్కైపించి,
వాట్సాపు వాడకంలో వారెంత వెనకబడ్డారో గ్రహించి, అదెలా వాడాలో వివరించి ముగించే సరికి,
ఖాళీగా ఉన్న టీవీ.. “మరి నా సంగతో?” అని నన్ను దీనంగా అడగ్గా,
ఎన్నాళ్ళనుంచో చూద్దామనుకున్న ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లు గుర్తుకు వచ్చి,
వాటిని ఒక్కొక్కటిగా చూస్తున్నప్పుడు,
‘అనుభవం నేర్పే పాఠం, విజయం వెనుక పోరాటం, కుటుంబంకోసం పడే ఆరాటం’
దాదాపు అందరి జీవితాల్లోనూ అగుపిస్తుండగా,
దాదాపు నాలుగు గంటల నుంచీ కళ్ళార్పకుండా చూస్తున్నానని, ఫోనులో వచ్చిన ఓ మెసేజ్ తట్టి చెప్పగా,
రేపటి ‘ఫాదర్స్ డే’ ని ఇవ్వాళే జరుపుకుందామని పిలిచిన స్నేహితులతో సరదాగా కాసేపు గడిపిన నాకు..
భార్యాపిల్లలు ఊళ్ళో లేని లోటుని పూరించి, మరిపించిన ఈ రోజు..
భలే మంచి రోజు!