పదో ఏడు. పిల్లాడు పెద్దాడయ్యే ఈడు.
బాల్యానికి దూరమౌతూ కౌమారానికి చేరువౌతుంటే..
అమాయకత్వమే తప్ప మరేదీ తెలీక, పరిచయంలేని మరో ప్రపంచం వైపు పరుగుపెడుతుంటే..
ఓ తండ్రి ఇచ్చే సూచన, దీవెన, బహుమానం.. అభిరామ దశకం.
పెద్దలని గౌరవించు.. పద్ధతులని పాటించు!
అల్పులని ఆదరించు.. తప్పులని మన్నించు!
ఉన్నదాన్ని అనుభవించు.. లేనిదాన్ని విస్మరించు!
ప్రతిభని గుర్తించు.. ఈర్ష్యని త్యజించు!
పరిసరాలని గమనించు.. కీడెంచి మేలెంచు!
మనసుని మందలించు.. బుధ్ధిని బుజ్జగించు!
నిరంతరం శ్రమించు.. లక్ష్యాన్ని సాధించు!
కష్టాన్ని అధిగమించు.. సంతోషాన్ని పంచు!
ప్రకృతిని ప్రేమించు.. జీవకోటిని రక్షించు!
పదోఏటిని స్వాగతించు.. పదిరెట్లు జీవించు!