కవనం: చేంబోలు సీతారామశాస్త్రి
చిత్రం: పట్టుదల
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: ఇళయరాజా
ఎప్పుడూ వొప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయం రా
నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్కముందు తక్కువేనురా సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా పశ్చిమాన పొంచివుండె రవిని మింగు అసురసంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా గుటకపడని అగ్గివుండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుందిరా నిశా విలాసమెంతసేపురా ఉషోదయాన్ని యెవ్వడాపురా రగులుతున్న గుండె కూడ అగ్నిగోళమంటిదేనురా
నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపొతె నిమిషమైన నీదికాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయమ్ము సారధౌనురా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ఆయువంటు వున్నవరకు చావుకూడ నెగ్గలేక శవముపైనె గెలుపు చాటురా
పిడుగువంటి పిడికిలెత్తి ఉరుమువల్లె హూంకరిస్తె దిక్కులన్ని పిక్కటిల్లురా ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదనుతొక్కి అవధులన్ని అధిగమించరా త్రివిక్రమా పరాక్రమించరా విశాల విశ్వమాక్రమించరా జలధిసైతమాపలేని జ్వాలవోలె ప్రజ్వలించరా
విశ్లేషణ
సంవత్సరం: 1992
రసం: చైతన్యం
అక్షరం: ఎ
గుర్తింపు: