కవనం: చేంబోలు సీతారామశాస్త్రి
చిత్రం: సిరివెన్నెల
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
సంగీతం: క్రిష్ణన్ కోయిల్ వేంకటాచలం మహదేవన్
విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం
ఓం
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం
ఓం
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
యెదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం
సరసస్వర సుర ఝరీగమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవనగీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
ప్రార్దిశ వీణియ పైన, దినకర మయూఖ తంత్రుల పైన
జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా
విశ్వకావ్యమునకిది భాష్యముగా
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
జనించు ప్రతిశిశు గళమున పలికిన జీవననాదతరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవనవాహినిగా
సాగిన సృష్టి విలాసమునే
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
నా ఉచ్చ్వాసం కవనం
నా నిశ్వాసం గానం
సరసస్వర సుర ఝరీగమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవనగీతం ఈ గీతం
విశ్లేషణ
ప్రణవనాదం = ఓంకారం, Om
విరించి = బ్రహ్మ, Lord Brahma
విపంచి = వీణ, small lute
ఝరి = సెలయేరు, mountain stream
ప్రార్దిశ = తూర్పు, the east
మయూఖం = కిరణం, ray of light
విహంగం = పక్షి, bird
తతి = గుంపు, group
స్వనము= శబ్దము, sound
భాష్యము = annotation
సంవత్సరం: 1986
రసం: భక్తి
అక్షరం: వ
గుర్తింపు: నంది పురస్కారం