కవనం: భరద్వాజ్ గాలి
చిత్రం: 35 చిన్న కథ కాదు
గానం: పృథ్వి హరీష్
సంగీతం: వివేక్ సాగర్
నీలి మేఘములలో ధరణీతేజం
నయనాంతరంగములలో వనధీనాదం
పోరునే గెలుచు పార్ధివీపతి సాటిలేని ఘనుడైనా
నీరజాక్షి అలిగే వేళ నుడివిల్లు ముడి వంచగలడా
సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా..
వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా
నీలి మేఘములలో ధరణీతేజం
నయనాంతరంగములలో వనధీనాదం
జలధి జలముల్ని లాలించు మేఘమే.. ఉహూ..
వాన చినుకు మార్గమును లిఖించదే
స్వయంవరం అనేది ఓ మాయే, స్వయాన కోరు వీలు లేదాయే
మనస్సులే ముడేయు వేళాయె, శివాస్త్రధారణేల కొలతాయే..
వరంధాముడే వాడే.. పరం యేలు పసివాడే
స్వరం లాగ మారాడే.. స్వయం లాలి పాడాడే
భాస్కరాభరణ కారుణీ గుణశౌరి శ్రీకరుడు వాడే
అవనిసూన అనుశోకాన స్థిమితాన తానుండలేడే
శరాఘాతమైనా గాని తొణికేవాడు కాడే
సిరి సేవించి సరి లాలించి, కుశలములు నిలుప ఘనమునొదిలి కదిలే
నీలి మేఘములలో ధరణీతేజం
నయనాంతరంగములలో వనధీనాదం
విశ్లేషణ
వనధి = సముద్రం
పార్థివి = సీత
మిథిలావేణి = సీత (మిథిలాపుర స్త్రీ)
జలధి = సముద్రం
వరంధాముడు = వరాలిచ్చు దేవుడు
పరం = పరలోకం
కారుణీ = కరుణగలవాడు
అవనిసూన = భూపుత్రి, సీత
అనుశోకం = దుఃఖం
శరాఘాతము = బాణము
సంవత్సరం: 2024